Graham Staines Story in telugu
గ్రాహం మరియు గ్లాడిస్
ఉపోద్ఘాతము
1999 జనవరి నెల 22వ తేది; అది ఒక చీకటి దినము అని చెప్పవచ్చు. మతోన్మాదుల యొక్క ఉన్మాదపు వికృత కార్యాలకు ప్రపంచము మొత్తం ఆశ్చర్యపడి కన్నీళ్ళు విడిచిన రోజు.
మిషనరీ గ్లాడిస్ స్టెయిన్స్
గ్లాడిస్ స్టెయిన్స్ అనే మహిళ (భారత దేశమునకు వచ్చిన మిషనరీ) ఒరిస్సా రాష్ట్రములో సజీవదహనం చేయబడిన వైద్య మిషనరీ గ్రాహం స్టెయిన్స్ గారి యొక్క భార్య.
జనవరి 22వ తేది 1999వ సంవత్సరం భారతదేశము యొక్క చరిత్రలోనే ఒక భయంకరమైన రోజు. ఆస్ట్రేలియా నుండి వచ్చిన మిషనరీ గ్రాహం స్టెయిన్స్ గారు (1941-1999) మరియు ఆయన ఇద్దరు కొడుకులు గిరిజన రాష్ట్రమైన ఒరిస్సా రాష్ట్రంలో సజీవదహనం అయ్యారు.
ఈ దుర్ఘటన తర్వాత గ్రాహం స్టెయిన్స్ గారి సతీమణి గ్లాడిస్ ను "మీరు ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్ళిపోయే ఆలోచనలో వున్నారా?" అని కొన్ని మీడియా ఛానెల్స్ ఆమెను ప్రశ్నించగా ఆమె “ఎన్నటికీ నాకు అటువంటి ఆలోచన లేదు. నా భర్త మరియు నా ఇద్దరు కొడుకులు ఈ భారత దేశానికై తమ ప్రాణాలు అర్పించారు. ఇండియా దేశము నా గృహము. ఇక్కడ నేను సంతోషంగానే ఉన్నాను.
నేను చనిపోయిన ఇక్కడనే సమాధి చేయబడాలని ఆశిస్తున్నాను” అని జవాబు ఇచ్చారు. ఆమె ఇంకా మాట్లాడుతూ... “ దేవుడు తన సేవకులైన ప్రతి వారు తనకు ఇంపైన సువాసన గల అర్పణముగా వారి జీవితాలు ఉండాలని పిలుచుకున్నాడు. నిన్ను ఏ పనికి పిలిచినా అందులో నమ్మకముగా ఉండాలి. "తిరిగి వెళ్ళాలి, విడిచి పోవాలి’ అను శోధనలకు లొంగిపోకూడదు. శ్రమలు మరియు బెదిరింపులు వచ్చినప్పటికి నీకు ముందుగా వెళ్ళిన ప్రభువు వైపు చూచుచు ముందుకు సాగవలెను. భారతదేశ ప్రజలకు చెప్పుటకు నా దగ్గర ఉన్న సందేశం ఇదే.
నేను నా భర్తను, నా ఇద్దరు కుమారులు సజీవ దహనము చేసిన ఆ హంతకుల యొక్క చర్యలను క్షమిస్తున్నాను. వారిపై నాకు ఎటువంటి కోపం, ద్వేషం కూడా లేదు. యేసుక్రీస్తు మాత్రమే వారిని క్షమించగల దేవుడు. కాని వారు దేవునిని క్షమాపణ కోరాలి. నాకు ఒక గొప్ప కోరిక “ ఈ భారత దేశములోని ప్రతి పౌరుడు యొక్క పాపాల కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసిన యేసుక్రీస్తుతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలి. ప్రతి యేసు ప్రతి భారతీయుని ప్రేమిస్తున్నాడని తెలుసుకొనవలెను. మనమందరము ద్వేషాన్ని దహించివేసి, క్రీస్తు ప్రేమ అనే అగ్నిని వ్యాపింపచేయాలి”.
గ్లాడిస్ జననం మరియు బాల్యము
గ్లాడిస్ గారు 1981వ సంవత్సరములో ఆపరేషన్ మొబలైజేషన్ (OM) నందు చేరినది. వారితో కలిసి సింగపూర్, మలేషియా, యూరోప్ అదేవిధంగా ఇండియా దేశాలలో పనిచేసినది. 18 నెలలు భారత దేశములో ఉన్న సమయంలో ఆమెను యేసు క్రీస్తు వారు చాలా అనుభవముల ద్వారా తీసుకువెళ్ళాడు. అనేక సార్లు బీహార్, ఒరిస్సా, పంజాబ్ ప్రాంతములలో వారు తమ వాహనము నందు యవ్వన మిషనరీలుగా ప్రయాణాలు చేస్తున్న సమయాలలో దేవుని కాపుదలను పొందడం జరిగినది. 1981 సంవత్సరమందు ఆమె ఒరిస్సా రాష్ట్రంలోని గ్రామాలను దర్శిస్తూ బారిపదకు వచ్చి గ్రాహం స్టెయిన్స్ గారి గృహము నందు అతిధులుగా ఉన్నారు. అక్కడ బల్ల మీద చదవడానికి ఉంచిన ఒరియా వ్యాకరణము మరియు మయూర్ భంజ్ అను ప్రాంతం గురించి ఉన్న పుస్తకములను ఆమె చదివినది. గ్రాహం కూడా ఆస్ట్రేలియాలోని తాను వుండే ప్రాంతామునకు కేవలం ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతం నుండి వచ్చాడని విని ఆశ్చర్యపోయినది గ్లాడిస్. యేసు దేవుడు ఒక ప్రణాళిక ద్వారా వారిద్దరిని మన దేశానికి నడిపించాడు. కొంతమంది OMకి సంబంధించినటువంటి పెద్దలు వారి నిమిత్తమై ప్రార్ధించి వివాహ ప్రస్తావన చేయడం జరిగింది.
మిషనరీ పరిచర్య మరియు వివాహము
దైవ చిత్తానుసారముగా గ్రాహం మరియు గ్లాడిస్ వారి యొక్క వివాహం ఇప్సివిచ్ చాపెల్ యందు ఆగష్టు నెల 6వ తేది 1983లో జరిగినది. అటు పిమ్మట ఏప్రిల్ నెలలో గ్రాహం గారు మిషనరీ పరిచర్య కొరకై తిరిగి వెళ్ళగా; గ్లాడిస్ వీసా నిమిత్తమై 6 నెలలు అక్కడనే ఉండవలసి వచ్చినది. వారు బారిపద అను గ్రామములో తమ మిషనరీ పరిచర్యను ప్రారంభించిరి. గొప్ప మిషనరీగా మాత్రమే కాక, ఒక మంచి భర్తగా, తండ్రిగా గ్రాహం ఉన్నందుకు దేవునిని స్తుతించినది గ్లాడిస్. అతని క్రమశిక్షణ కలిగిన జీవితము ద్వారా గ్లాడిస్ ఎంతో స్ఫూర్తిపొందినది.
గ్రాహం గారు యేసుక్రీస్తు లానే దయ అదేవిధంగా కనికరము, జాలి కలిగిన మనిషి. పరిచర్యలో అనేక అవసరతలు ఉన్నప్పటికీ ఎన్నడూ దిగులుచెందేవాడు కాదు.ప్రతీ విషయంలో ప్రభువును స్తుతిస్తూ ”నేను రాజుల రాజుకు బిడ్డను. నేను ఎందుకు సహాయము కొరకు మానవుల ఆశీర్వాదము కొరకు విజ్ఞాపన చేయాలి? అని పలికేవాడు.
గ్రాహం మరియు గ్లాడిస్ అనే ఈ ఇద్దరు ఒకే విశ్వాసము, దర్శనము కలిగి సేవలోను ఏకముగా ఉన్నారు. వారు వైద్యము అదేవిధంగా పునరావాసము [రీహాబిలిటేషన్] కొరకు 2 సెంటర్లను ప్రారంభించిరి. బారిపదకు రెండు కిలోమీటర్ల దూరములో ఆసుపత్రి అలాగే 10 కిలోమీటర్ల దూరము నందు లెప్రసీ రీహాబిలిటేషన్ సెంటర్లు (కుష్టు రోగుల కొరకు) ఉన్నాయి.
గ్రాహం మరియు గ్లాడిస్ సంతానము
స్టెయిన్స్ దంపతులు మిషను కాంపౌండ్ నందు గల ఒక పాత ఇల్లులో ఎంతో సాధారణమైన జీవితమును జీవించినవారు. దేవుడు వారిరువురికి ముగ్గురు సంతానమును దయచేసి ఆశీర్వదించారు. కూతురు ఎస్తేర్ నవంబర్ 7న,1985లో జన్మించారు, కుమారుడు ఫిలిప్ మార్చి నెల 31,1988లో మరియు రెండవ కుమారుడు తిమోతి హెరాల్డ్ మే 4 తేదీ 1992 సంవత్సరంలో జన్మించారు.
వారి ముగ్గురిలో ఎస్తేర్ , ఫిలిప్ లను విద్య కొరకు 2,౦౦౦ కిలోమీటర్ల దూరములో గల ఉదక మండలంలోని మిషనరీ పాఠశాల నందు చేర్పించిరి.
సేవకుల సజీవ దహనము
జనవరి 22వ తేది ,1999న మనోహర్ పూర్ అను గ్రామమునకు గ్రాహం తన ఇద్దరి కుమారులతో కలిసి అక్కడ అటవీ ప్రాంతం నందు ప్రతి ఏట జరిగు కూడికలో పాల్గొన్నాడు . తమ ప్రియమైన తండ్రితోపాటు కలిసి అచ్చటకు వెళ్ళుట చిన్నారులకు చాలా ఉత్సాహామును ఆనందంను ఇచ్చింది. ఆ స్థలంలో యవ్వనస్తులైన కొండ జాతివారు గుంపులుగా నృత్యాములు చేయసాగారు. వారు స్టెయిన్స్ బస చేసినటువంటి వాహనమునకు 100 మీటర్ల దూరాన ఉన్నారు.
![]() |
| Daara Singh |
సమయము అర్థరాత్రి 12:20పీఎం అయినది. అప్పటికే అచ్చటకు రమద అను ప్రాంతము నుంచి దారాసింగ్ అనే వ్యక్తి మరియు అతని బృందము చేరుకున్నారు. దారాసింగ్ అనే ఈ వ్యక్తి క్రైస్తవులను మరియు మిషనరీలను ఎంతగానో ద్వేషిస్తు ఉండేవాడు. వారు 12:20 సమయమైనప్పుడు అరుస్తూ కర్రలు, ఆయుధములతో స్టెయిన్స్ మరియు అతని ఇద్దరి కుమారులు బస చేసిన వాహనమును సమీపించారు. దారాసింగ్ తన వద్ద ఉన్న గొడ్డలితో టైర్లలో గాలిపోయే విధంగా చేశాడు. మిగతా బృందం వారు కిటికీలకు ఉన్న అద్దములను పగులకొట్టినారు. గ్రాహం స్టెయిన్స్ గారు మరియు పిల్లలను కర్రలతో కొట్టారు. ఓ పక్క దారాసింగ్ గడ్డిని తెచ్చి వాహనానికి అగ్నిని అంటించాడు. కొద్ది క్షణాల్లోనే ఆ వాహనము దగ్ధం అయిపోయింది.
గ్రాహం గారు తన ఇద్దరు కొడుకులను పట్టుకొని ‘క్ర్రీస్తు ప్రభువా...’ అని పెదవులతో పలుకుచూ అగ్నికి ఆహుతి అయ్యారు. వారు ముగ్గురు పూర్తిగా కాలిపోవు వరకు దారాసింగ్ మరియు అతని మనుష్యులు అక్కడనే ఉన్నారు. అటు తర్వాత దారసింగ్ బృందం వెళ్లిపోయిన తరువాత అక్కడున్న మిగతా మిషనరీ టీమ్ వారు మంటలను ఆర్పుటకు ప్రయత్నించినారు. మరణ అనంతరం వారికి అంజలి ఘటిస్తూ వేలాది ప్రజలు వచ్చారు. బారిపద గ్రామ వాసులందరు సమాధి కార్యక్రమములో పాల్గొన్నారు. లెప్రసీ మిషన్లోని వారిని ఓదార్చటము, ఆదరించటం ఎవరితరమూ కాకపోయెను.
ఎస్తేర్, గ్లాడిస్ ఆ యొక్క ముగ్గురి సమాధుల వద్ద కూర్చుని అక్కడున్న వారితో కలిసి పరిశుద్ధ గ్రంథములోని వాక్యములను పటించిరి. ప్రాంతీయ భాష అయినటువంటి సంథాలి భాషలో గీతాములను ఆలపించినారు. గ్లాడిస్ గారు ప్రశాంతనుగా, స్థిమితముగా కనిపించారు. దేవుడు ఇటువంటి పరిస్థితుల ద్వారా వెళ్ళవలసి ఉంటుంది అని తన మౌన ధ్యాన సమయములో ముందుగానే ఆమెకు తెలియజేసాడు.
మా నాన్న గారు యేసుక్రీస్తు కొరకై మరణించుటకు తగినవ్యక్తిగా దేవుడు యెంచినందుకై నేను దేవునిని స్తుతించుచున్నాను’ అని ఎస్తేర్ చెప్పినది.
ముగింపు:
“కుష్టురోగుల మధ్యలో పరిచర్యను చేయు లాగున చాలా త్యాగపూరితమైన సేవా దృక్పదంతో వచ్చిన ఇలాంటి వ్యక్తికి కృతజ్ఞతలు తెలిపి ఆదర్శప్రాయులుగా పొగడాలికాని సహనానికి , అహింస వాదమునకు పేరు పొందినటువంటి ఇటువంటి భారతదేశములో జరుగుతున్న ఈ అమానుషమైనచర్య లోకంలోని చీకటి పనులకు చెందినటువంటి తప్పు “ అని అప్పటి భారత దేశ రాష్ట్రపతి శ్రీ.కే.ఆర్.నారాయణనగారు పలికారు. 2005వ సంవత్సరంలో భారత ప్రభుత్వము గ్లాడిస్ ను "పద్మశ్రీ" బిరుదుతో సత్కరించినది.


