Literary Modes in the Bible

బైబిల్లోని వివిధ సాహిత్య రీతులు 

      క్కొక్క సాహిత్య రీతిలో ఎన్నో గ్రంథాలుంటాయి. ఏదైనా ఒక ఉపకరణాన్ని ఎలా ఉపయోగించాలో తెలిపే నియమావళి ఆ ఉపకరణానికి సంబంధించిన సాంకేతిక భాషలో వుంటుంది. నవలలో కాల్పనిక వర్ణన వుంటుంది. పద్యంలో యతి ప్రాసలుంటాయి. ఏ నిబద్ధతకు లోబడని గేయాలు కూడ వుంటాయి. చరిత్ర గ్రంథాల్లో చారిత్రక సందర్భాల వివరణ కన్పిస్తుంది. గ్రంథం ఏ కోవకు చెందుతుందో అనే దాని మీద ఆ గ్రంథం రచనశైలి కూడ ఆధారపడి వుంటుంది. బైబిలు ఒక పెద్ద గ్రంథం. దీంట్లో వివిధ సాహిత్య శైలుల్లో రాసిన వివిధ రచనలు వున్నాయి. విభిన్న శైలుల్లో వున్న బైబిలు గ్రంథం పాఠకుల్లో మరింత ఉత్సుకతను కల్గించి వారికో సవాలుగా నిలుస్తుంది. బైబిలును అధ్యయనం చేసేటప్పుడు ప్రతి పుస్తకాన్ని చదవడంతో బాటు ఆ పుస్తకం రచనా శైలిని కూడ పరికించడం చాలా ముఖ్యం. రచయిత ఉద్దేశాలను తెలుసుకోవడానకి రచనాశైలి ఉపకరిస్తుంది. ఉదా : 1సమూ. 1:1-28 చూడండి. ఈ వాక్యభాగాన్ని 1సమూ. 2:1-10 లోని వాక్యభాగంతో పోల్చి చూడండి. ఒకే పుస్తకంలో వేర్వేరు రచనాశైలులు కన్పిస్తాయి. మొదటి భాగం గద్యం (వచనం), రెండవ భాగం పద్యరూపంలో వున్న కీర్తన లేక ప్రార్థన. పాఠకులు పుస్తకం ఉద్దేశాన్ని గ్రహించడంలో ఈ మార్పు సహాయపడుంది.

    క్రొత్త నిబంధన నుంచి మరో క్లుప్తమైన ఉదాహరణ : యేసు జనన వృత్తాంతం. లూకా 2:1-21లో యేసు జననం గురించి ఎన్నో వివరాలు సంఘటలను కబ్బన్పిస్తాయి. ఇందుకు భిన్నంగా యోహాను సువార్తలో యేసు జననం గురించి ఏ ప్రస్తావనా కన్పించదు. ప్రతిగా, యేసు వాక్యము అని, నిజమైన వెలుగు అని, ఆయన శరీరధారి అయ్యాడని సూచించే కావ్యవర్ణన కన్పిస్తుంది (1:1-14). యేసు ఎవరనే ఆలోచనలను ఈ వివిధ సాహిత్య రీతులు ఎలా ప్రభావితం చేస్తాయి? సువార్త రచయితలు తమ సువార్తల్లో యేసు జననం గురించి ఆయన మూర్తిమత్వం వ్యక్తిత్వం గురించి వివిధ అంశాలను ఎందుకు వక్కాణించారు? ఒక్కొక్క రచయిత తన ఉద్దేశాలను ఏ శైలిలో చెప్పాడనే సంగతి కూడ బైబిలు ఏం బోధిస్తుందో తెలుసుకోవడానికి క్రొత్త మార్గాలను చూపిస్తుంది.

      బైబిల్లో వివిధ సాహిత్య రీతులు వున్నాయి. కొన్ని పుస్తకాలు ఆద్యంతం ఒకే సాహిత్య శైలిలో వున్నాయి. వీటిలో ముఖ్యమైనవి ఆజ్ఞలు, విధులు, చరిత్ర, పద్యం, కీర్తనలు, జ్ఞానసాహిత్యం, సామెతలు, సువార్తలు, పత్రికలు దర్శనసాహిత్యం. కొన్ని పుస్తకాల్లో విభిన్న సాహిత్య శైలులు కన్పిస్తాయి. వీటిల్లో వర్ణన ప్రార్థన ఉపమానాలు ప్రవచనాలు (దేవోక్తులు) వంశావళులు ముఖ్యమైనవి. ఆజ్ఞలు, కట్టడాలు, న్యాయవిధులు: అనేక ప్రాచీన పశ్చిమాసియా సంస్కృతుల్లో ప్రతి సంస్కృతిలోనూ వేర్వేరుగా న్యాయ విధి విధానాలుండేవి (చట్టాలు). వీటిలో బబులోను అధిపతి హమ్మూరాబి (క్రీ.పూ. 1750-1792) ఆధ్వర్యంలో అమలులోనికి వచ్చిన శిక్షాస్మృతి బాగా ప్రసిద్ధి చెందింది. యూదు లేఖనాలలోని (పాత నిబంధన) మొదటి ఐదు గ్రంథాలను పంచగ్రంథాలు లేక పంచకాండాలు లేక ధర్మశాస్త్రం (తోరా) అని పిలుస్తారు. ఈ గ్రంథాల్లో ధర్మవిధులతోబాటు మరెన్నో విషయాలు కూడ వున్నాయి. ఈ ధర్మవిధుల్లో నిషేధాజ్ఞలు (చేయకూడదు), అనుసరించదగిన ఆజ్ఞలు (చేయవలెను) వున్నాయి. ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి సరైన రీతిలో ఆరాధించడం ఒకరిపట్ల ఒకరు యథార్ధంగా ప్రవర్తించడం ధర్మశాస్త్రం ముఖ్యోద్దేశం. బైబిల్లో ముఖ్యమైన ధర్మవిధులు 'పది ఆజ్ఞలు' (నిర్గమ. 20:1-17, ద్వితీ. 5: 6-21). ఇతర ఉదాహరణలు : నిర్గమ. 21:1-23:19,2:6, లేవీయ. 1:1-7:36, సంఖ్యా. 6:1-21, 35:16-34, ద్వితీ 14:3-17:7, యాకోబు 4:11,12.

చరిత్ర: 

    పాత నిబంధనలోని చరిత్ర గ్రంథాలు ఇశ్రాయేలీయులు క్రీ.పూ. 1250లో కనాను దేశంలో స్థిరపడినప్పటి నుండి క్రీ.పూ. 587లో యెరూషలేము పతనం వరకు గల చరిత్రను వివరిస్తాయి. ఈ గ్రంథాల్లో ప్రముఖ ప్రవక్తలైన ఏలీయా ఎలీషా జరిగించిన అద్భుతకార్యాలు ఇశ్రాయేలును యూదాను పరిపాలించిన రాజుల కార్యాలు (దావీదు సొలొమోనుతో సహా) కన్పిస్తాయి. క్రీ.పూ. 931లో ఇశ్రాయేలు దేశం రెండుగా వేరైపోయిన తర్వాత జరిగిన సంఘటనల వివరాలు కూడ ఈ చరిత్ర గ్రంథాల్లో కన్పిస్తాయి. యోహోషువ, 1,2 రాజులు గ్రంథాలు పాతనిబంధనలోని చరిత్ర గ్రంథాలు. క్రొత్తనిబంధనలోని అపొస్తలుల కార్యములు ఆది క్రైస్తవ సంఘచరిత్రను తెలియజేస్తుంది. పద్యం, కీర్తనలు: విభిన్న రీతులున్న పెద్ద విభాగమిది. యోబు కీర్తనలు పరమగీతము గ్రంథాల్లో పద్యశైలి కన్పిస్తుంది. బైబిల్లో కొన్ని ప్రాచీన స్తుతిగీతాలు (కీర్తనలు) పద్యశైలిలో వున్నాయి. కీర్తనల్లో అధికభాగం ఆరాధనలో వుపయోగపడినవే. కొన్ని కీర్తనలు వాస్తవానికి ప్రార్థనలే. ప్రవక్తల సందేశాలు కూడ కొన్ని చోట్ల పద్యశైలిలో వున్నాయి. హెబ్రీ పద్యాన్ని అనువదించడం అంత సులభం కాదు. 

     మూలభాషలో ఉన్న శక్తిమంతమైన అర్థాన్ని పరిభాషను అనువాదంలో ప్రతిబింబించడం మామూలు విషయం కాదు. ఒకే భావాన్ని రెండు సామ్యాలతో (పోలికలతో) వర్ణించడం హెబ్రీ పద్యం విశిష్టత. కీర్తన 22:9,10 వచనాలు ఈ వర్ణనకు చక్కని ఉదాహరణ. పాత నిబంధనలోని మరి కొన్ని ఉదాహరణలు : నిర్గమ 15:1-18, యోబు 22:21-30, కీర్తన 23, యెషయా 5:1-7, యోనా 2:2-9. క్రొత్త నిబంధనలో కూడ పద్యశైలి కన్పిస్తుంది. లూకా 1:46-55, ఫిలిప్పీ, ప్రకటన 15:3,4 పద్యశైలికి చక్కని వుదా: జ్ఞానయుక్తమైన సూక్తులు, సామెతలు: పాత నిబంధనలో మరో పెద్ద విభాగమిది. ఆరాధనా ప్రకరణంలో పద్యం కీర్తనలు కథవంటి విభిన్న శైలులు కన్పిస్తాయి. లోకం గురించి దేవుని గురించి మనుషులు గతి గురించి వివేచన (ఇంగిత జ్ఞానం) కలిగించే సామెతలు సూక్తులు ఒక విశిష్టమైన శైలిలో వుంటాయి. జ్ఞానయుక్తమైన సామెతలు సూక్తులు సామెతలు గ్రంథంలోనే కాక బైబిలోని యితర గ్రంథాల్లో కూడ కన్పిస్తాయి. ప్రసంగి యోబు గ్రంథాల్లో తాత్విక ధోరణితో బాటు జ్ఞానవంతమైన ఉపదేశాలు కూడ వున్నాయి.

     జ్ఞానసాహిత్యంలో ఇశ్రాయేలు చరిత్ర వివరాలు కన్పించవు. అయితే, నైతికత గురించి మానవ జీవితంలోని కఠినమైన వాస్తవాల గురించి వివిధ సవాళ్లు ఈ గ్రంథాల్లో కన్పిస్తాయి. జ్ఞానసాహిత్యంలోని కొన్ని గ్రంథాలను అత్యంత జ్ఞాని ఇశ్రాయేలు రాజు సొలొమోను రచించినట్లు చెబుతుంటారు. బహుశా వీటిల్లో కొన్ని సొలొమోను మరణానంతరం అతని పేరు మీద వ్రాసిన గౌరవార్థ రచనలై వుండవచ్చు. యిప్పటి వరకు ప్రస్తావించిన వాటితో బాటు కీర్తన 1, కీర్తన 37లను కూడ జ్ఞానసాహిత్యానికి చక్కని ఉదాహరణలుగా చెప్పవచ్చు. జ్ఞాన సాహిత్యం క్రొత్త నిబంధనలో కూడ ప్రముఖంగా కన్పిస్తుంది. పర్వత ప్రసంగం (మత్తయి 5-7 అధ్యాయాలు), యాకోబు 3:2-8, 4:13-17 వచనాలు క్రొత్త నిబంధనలోని జ్ఞానసాహిత్యానికి సోదాహరణలు.


సువార్తలు: 

   క్రొత్త నిబంధనలోని మత్తయి మార్కు లూకా యోహాను సువార్తలు యేసు జీవితం గురించి ఆయన బోధల గురించి వివరిస్తాయి. వీటిని సువార్తలు అని పిలుస్తారు. ఇవాంజెలియన్ అనే గ్రీకు పదానికి గాడ్ స్పెల్ అనే ప్రాచీన ఆంగ్లపదం సూటి అయిన అనువాదం. గాడ్ స్పెల్ అనే పదం నుంచి గాస్పెల్ అనే పదం వచ్చింది. గాస్పెల్ అంటే సువార్త అని అర్థం. 


పత్రికలు: 

     క్రొత్త నిబంధనలో అపొస్తలుడైన పౌలు యింకా యితరులు రాసిన పత్రికలు వున్నాయి. యివి క్రీస్తు శకం మొదటి శతాబ్దం గ్రీకు లేఖరచనాశైలిలో రాసిన పత్రికలు. రచయిత పరిచయం పత్రిక ప్రారంభంలో కన్పిస్తుంది (ఉదా : రోమా 1:1,2-7). ఆ తర్వాత, పత్రికను ఎవరికి వ్రాశారో వారి ప్రస్తావన, శుభవచనం కన్పిస్తాయి (ఉదా : రోమా 1:2-7). పత్రికలో ప్రధాన భాగం సందేశం (ఉదా : రోమా 1:16-15:35). పౌలు పత్రికల్లో చాలా వాటిల్లో శుభవచనం తర్వాత కృతజ్ఞతాపూర్వకమైన ప్రార్థన వుంటుంది (ఉదా : రోమా 1:8-15). అంతిమ శుభవచనంతో ఆశీర్వాదంతో పత్రిక ముగుస్తుంది (ఉదా : రోమా 16:1-27). ప్రతి పత్రికలో ప్రార్థనలు ఉపదేశాలు బోధ జ్ఞానసాహిత్యం హెచ్చరికలు ఆరాధనాగీతాలు (లేక, కీర్తనలు) వ్యక్తిగత సమాచారం వంటి విభిన్న రీతులు కన్పిస్తాయి. క్రొత్త నిబంధనలో పత్రికలు విభాగంలో కన్పించే కొన్ని రచనలు క్రైస్తవులందరికి వర్తించే సాధారణాంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తాయి.