Writing Style in the Bible
జూన్ 29, 2021
బైబిల్ లోని రచనా శైలి
గద్యం (వచనం):
వర్ణన వివరణ వచనంలో ప్రధానభాగాలు. వ్యక్తుల గురించి చరిత్ర గురించి వర్ణన వచనంలో కన్పిస్తుంది. వచనంలో సంభాషణ అనే మరో రచనాశైలి కూడ కన్పిస్తుంది. బైబిల్లో చాలా భాగం వచనంలో వుంటుంది. గద్యరచనలో కథ లేక ఇతివృత్తం ప్రముఖమైంది. కొన్ని ఇతివృత్తాలు క్లుప్తంగా కేవలం కొన్ని అధ్యాయాలకే పరిమితమై వుంటాయి. ఉదా: నోవహు (ఆది 6-10), యోసేపు (ఆది 37:1-47:26), మరికొన్ని గ్రంథాల్లో గ్రంథమంతటా ఒకే ఒక వృత్తాంతం వుంటుంది (ఉదా: రూతు, ఎస్తేరు). సువార్తలు యేసు జీవితం గురించి ఆయన మరణ పునరుత్థానాల గురించి వివరిస్తాయి. అయితే, సువార్తల్లో మరికొన్ని కథనాలు కూడ వున్నాయి. ఉదా: బాప్తిస్మమిచ్చు యోహాను (మత్తయి 3:1-17, 11:1-19, 14:1-12). అపొస్తలుల కార్యములు గ్రంథం పేతురు గురించి పౌలు గురించి యేసుక్రీస్తు సందేశాన్ని ప్రకటించిన యితర శిష్యుల గురించి తెలియజేస్తుంది.
ప్రార్థనలు:
ప్రార్థనలు గద్యంలోనూ పద్యంలోనూ వుంటాయి. దేవునితో సంభాషించడమే ప్రార్థన. ఇదే ప్రార్థన విశిష్టత. కీర్తనలు గ్రంథంలో పద్యరూపంలో వున్న ప్రార్థనలు కన్పిస్తాయి. కొన్ని కీర్తనలు బహిరంగ ఆరాధనలో దేవుని సహాయాన్ని అర్థిస్తూ చేసిన ప్రార్ధనలు (కీర్తన 79,80), మరికొన్ని కీర్తనలు పంట కోత సమయంలో చెల్లించే కృతజ్ఞతాస్తుతులు (కీర్తన 126), మరి కొన్ని కీర్తనలు క్రొత్త రాజు అభిషేక కార్యక్రమానికి సంబంధించినవి (కీర్తన 21), కొన్ని కీర్తనలు విచారాన్ని వెలిబుచ్చుతూ సహాయాన్ని అర్థిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ క్షమాపణ కొరకు వేడుకుంటూ చేసిన వ్యక్తిగత ప్రార్థనలు (కీర్తన 12,51,120,138). ప్రార్థనలు బైబిలు అంతటా కన్పిస్తాయి (కొన్ని ఉదాహరణలు: ఆది. 18:27,28; నిర్గమ. 17:4; న్యాయాధి. 5:2-31; 1సమూ.2:1-10; 1రాజులు. 3:6-9; యోనా 2:2-9; లూకా 11:2-4; 22:42; యోహాను 17:1-26; రోమా 16:25-27; హెబ్రీ. 13:21). అన్నిటికంటే ముఖ్యమైంది యేసు శిష్యులకు నేర్పిన ప్రార్ధన (మత్తయి 6:9-13).
ప్రవచనాలు:
పాతనిబంధనలో మరో ప్రధానభాగం ప్రవచన సందేశాలు (లేక దేవోక్తులు). యెహోవా వాక్కు లేక యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అనే పదాలతో ప్రవచనాలు ప్రారంభమౌతాయి. అనగా, ప్రవక్త పలికే సందేశం ప్రవక్త స్వంత సందేశం కాదని దేవుని వద్ద నుంచి వచ్చిన సందేశాన్నే ప్రవక్త పలుకుతున్నాడని అర్థం. ప్రవచన సందేశాలు పలుచోట్ల హెబ్రీ పద్యశైలిలో వున్నాయి. పద్యంలో సాధారణంగా కనిపించే భాషాలంకారాలు (ముఖ్యంగా సామ్యం, లేక పోలిక) ప్రవచనాల్లో కూడ కన్పిస్తాయి. పాత నిబంధన గ్రంథంలోని ప్రవచన గ్రంథాలు ప్రవక్త గురించి అతని పరిచర్య గురించి (ప్రవక్తకు దేవునివద్ద నుంచి వచ్చిన సందేశాలను) తెలియజేస్తాయి. పాత నిబంధనలో వైవిధ్యభరితమైన ప్రవచనాలకు యెషయా 1:2-31; 10:24-27; యిర్మీయా 2; యెహెజ్కేలు 36:22-32; ఆమోసు 5:4-27; జెకర్యా 9:1-17 చక్కని ఉదాహరణలు. క్రొత్త నిబంధనలో కూడ ప్రవచన సందేశాలు కన్పిస్తాయి. బాప్తిస్మమిచ్చు యోహాను గురించి యేసు గురించి వున్న ప్రవచనాలు క్రొత్త నిబంధనలో ముఖ్యమైన ప్రవచనాలు (మత్తయి 3:1-12; 24:1-31). 2 పేతురు 3:8-13 కూడ చూడండి. ఉపమానాలు: దేవుని గురించి ఆయన రాజ్యం గురించి ముఖ్యమైన సత్యాలను దైనందిన జీవితంలో అందరికి బాగా తెలిసినmవిషయాలతో పోల్చి చెప్పే చిన్న కథలే ఉపమానాలు.
ఉపమానాలు:
యేసు ఉపమానాల ద్వారా దైవసత్యాలను బోధించినట్లు సువార్తలు తెలియజేస్తున్నాయి. ఉపమానాలు క్లుప్తంగానైనా (మత్తయి 13:44-48), లేక వివిధ పాత్రలతో లేక సాదృశ్యాలతో పెద్దవైనా కావచ్చు (లూకా 10:30-37; 15:11-32). ఉపమానాలు అన్న చిన్న వ్యాసం కూడ చూడండి. వంశావళులు (కుటుంబ పట్టికలు): బైబిల్లో సుదీర్ఘమైన వంశావళులు కన్పిస్తాయి. ఇశ్రాయేలు చరిత్రలో ప్రముఖుల కుటుంబ చరిత్రను ఈ వంశావళులు తెలియజేస్తాయి. మత్తయి సువార్త ప్రారంభంలో కన్పించే వంశావళి యేసు దావీదు వంశం నుంచి వచ్చాడని తెలియజేస్తుంది (మత్తయి 1:1-17). యేసు దావీదు వంశీయుడని, ప్రవక్తల ప్రవచనాల ప్రకారం లోకాన్ని రక్షించడానికి వచ్చిన అభిషిక్తుడని తెలియజేయడానికి మత్తయి సువార్త రచయిత ఈ వంశావళిని పేర్కొన్నాడు. పితరుల పట్టికలను బైబిల్లో ఎందుకు చేర్చారో అన్ని సందర్భాల్లో స్పష్టమైన కారణాలు తెలియనప్పటికీ ఇశ్రాయేలు ప్రజలకు ప్రాచీన పశ్చిమాసియా ప్రజలకు బంధుత్వాలు ముఖ్యమని వీటిని బట్టి తెలుస్తుంది. కొన్ని వంశావళులు పేర్ల పట్టికలు ఆది. 5:1-32; 18న. 1-8; ఎజ్రా 8:2-14లలో వున్నాయి.