Bible Truth for Life
జీవితాన్ని అధ్యాయనం చేయు పరిశుద్ధ గ్రంథము
ప్రజల జీవన విధానాన్ని అధ్యయనం చేయడం:
బైబిలు కాలంలో ప్రజల జీవనవిధానం గురించి కూడ పురావస్తు పరిశోధనలు తెలియజేస్తున్నాయి. రాజ్యపరిపాలనా పద్దతుల గురించి ప్రజల వృత్తులు వ్యాపకాల గురించి వారి ఆహారపుటలవాట్ల గురించి వారుపయోగించిన వస్తువుల గురించి భవననిర్మాణ పద్ధతుల గురించి మతసాంప్రదాయాల గురించి నమ్మకాల గురించి భవిష్యత్తుపట్ల వారికున్న ఆశాభానం గురించి కూడ పురావస్తు ఆధారాలు తెలియజేస్తున్నాయి.
ప్రాచీన కాలంలోని సంస్కృతుల గురించి ఎన్నో వివరాలు వేర్వేరు ఆధారాల ద్వారా లభిస్తాయి. సంతానం లేని ఒక స్త్రీ తన దాసి ద్వారా బిడ్డలను కనమని తన భర్తను అడగవచ్చని హమ్మూరాబి శిక్షాస్మృతి వివరిస్తుంది. తాను గొడ్రాలు కాబట్టి శారా అబ్రాహాంను హాగరు ద్వారా సంతానాన్ని పొందమని అడగడానికి (ఆదికాండము 16 అధ్యాయం) బహుశా ఈ ఆచారమే కారణం అయ్యుండవచ్చు. మరో ముఖ్యమైన పురావస్తు పరిశోధన నాణేలకు సంబంధించినది. వీటి ప్రస్తావన ఎజ్రా 2:69; నెహమ్యా 7:70-72లలో కన్పిస్తుంది. స్థానిక పరిపాలనాధికారాలను తెలుసుకోడానికి చారిత్రక కాలాన్ని నిర్ధారించడానికి నాణేల పరిశోధన ఎంతో ఉపయుక్తమైనది. దంతంతో చేసిన నగిషీ పని పూజాప్రతిమలు మట్టికుండలు ఆభరణాలు అస్థికలు (మనుషుల, పశువుల యెముకలు)
బైబిలు కాలంనాటి సంస్కృతుల గురించి తెలుసుకోడానికి దోహదం చేస్తాయి. యేసు కాలంనాటి అస్తిపంజరాలు అప్పటి ప్రజల సరాసరి ఎత్తు ఐదడుగుల పైనేనని తెలియజేస్తున్నాయి. సువార్తల్లో వివరించినట్లుగా నేరస్థుణ్ణి సిలువకు మేకులతో కొట్టేవారని కూడ పురావస్తు ఆధారాలు తెలియజేస్తున్నాయి. పాదంలో మేకు విరిగి వున్న కాలిపిక్క వున్న పురుషుని అస్థిపంజరాన్ని శిథిలాల్లో కనుగొన్నారు. సిలువవేయడం గురించి, సిలువవేయబడిన నేరస్థుణ్ణి కాళ్లు విరగగొట్టడం గురించి యోహాను సువార్త తెలియజేయడం విదితమే (యోహాను 19-18,32) మరి కొన్ని పురావస్తు పరిశోధనలు యేసు కాలంలో రోమన్ల శిల్పకళా నైపుణ్యం గురించి భవన నిర్మాణకళ గురించి తెలియ జేస్తాయి. మహా హేరోదు నిర్మించిన దేవాలయపు శిథిలాలు సైతం నేటికీ భద్రంగా వున్నాయి. అలాగే గ్రీకు రోమన్ దేవుళ్ల దేవతల గుళ్ల శిథిలాలను సైతం కనుగొన్నారు. బైబిలు కాలం గురించి తెలుసుకోవాలనుకొనే వారికి యివి ఎన్నో వివరాలు నందిస్తాయి. తొలి క్రైస్తవులు గతంలో యూదు మతాన్ని అవలంభించిన వారేనని, వారిమీద నాటి తత్వసిద్ధాంతాల ప్రభావం కూడ ఉందనేది విస్మరించలేని విషయమని పురావస్తు ఆధారాలు తెలియజేస్తున్నాయి.